India: ఐదు రోజుల తరువాత... ఎట్టకేలకు కెనడా ప్రధానికి స్వాగతం పలికిన నరేంద్ర మోదీ... అది కూడా ట్విట్టర్ లోనే!
- ఐదు రోజుల క్రితం ఇండియాకు వచ్చిన కెనడా ప్రధాని
- దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన
- నేడు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు
- ఆయనకు వెల్ కమ్ చెప్పిన నరేంద్ర మోదీ
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన భార్య, పిల్లలతో కలసి భారత పర్యటనకు ఐదు రోజుల క్రితం రాగా, ఆయనకు తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, తన ట్విట్టర్ వేదికగా స్వాగతం పలికారు. ఏ దేశాధినేత వచ్చినా ప్రొటోకాల్ ను సైతం పక్కనబెట్టి, ఎదురెళ్లి స్వాగతం పలికే మోదీ, ట్రూడోను పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
వారం రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ట్రూడో, నేడు ప్రధానిని ఢిల్లీలో కలసి చర్చలు జరపనున్నారు. గడచిన శనివారం నుంచి ఆయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కెనడాలో సిక్కు సంతతి అధికంగా ఉండటంతో, ఇండియాలో సిక్కులు డిమాండ్ చేసే ఖలిస్థాన్ పై ఆయన గతంలో పలుమార్లు మద్దతు పలికేలా వ్యాఖ్యానించడం, ముంబైలో ఆయన కార్యక్రమానికి ఖలిస్థాన్ తీవ్రవాదిని ఆహ్వానించడం కూడా విమర్శలకు తావిచ్చింది.
ఇదిలావుండగా, ప్రధాని మోదీ, ఆయనను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, "జస్టిన్ ట్రూడో కుటుంబం ఇప్పటివరకూ ఇండియాలో ఆనందంగా గడిపిందని భావిస్తున్నాను. వారి పిల్లలు జేవియర్, ఎల్లా గ్రేస్ లను కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఉన్నాను. నేను 2015లో కెనడాకు వెళ్లిన చిత్రమిది. అప్పట్లో నేను ట్రూడోతో పాటు ఎల్లా గ్రేస్ లను కలిశాను" అని మోదీ ట్వీట్ చేశారు. రెండేళ్ల క్రితం దిగిన ఫోటోను పోస్టు చేశారు. కాగా, నేటి సమావేశంలో ఇద్దరు నేతల మధ్య రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, వాతావరణ మార్పులు, విద్య తదితర రంగాల్లో సహాయ సహకారాలపై చర్చ సాగనుంది.