Narendra Modi: మోదీ రాకను అడ్డుకుంటామని హెచ్చరించిన తమిళనాడు జాక్టో-జియో
- రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాఖ్య
- ప్రధాని ప్రయాణించే మార్గాలను ముట్టడిస్తాం
- మా డిమాండ్లను వెంటనే నెరవేర్చండి
ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటించే మార్గాలను ముట్టడిస్తామంటూ జాక్టో-జియో సమాఖ్య తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఏర్పాటు చేసుకున్న వేదికే జాక్టో-జియో. 15 సమస్యల సాధన కోసం గత ఏడేళ్లుగా ఈ సమాఖ్య సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేయాలి, 7వ వేతన ఒప్పందంలో భాగంగా అందాల్సిన 21 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలి.. వంటి డిమాండ్లతో వారు ఆందోళన చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ సమాఖ్య నేతలు మాట్లాడుతూ, ప్రతిరోజూ తాము చేపడుతున్న ఆందోళనలను అడ్డుకుంటున్న పోలీసులు... తమను రాజారత్నం స్టేడియంకు తరలిస్తున్నారని... అలా కాకుండా తమను పుళల్ జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. రేపు ప్రధాని వెళ్లే మార్గాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.