Chandrababu: అప్పట్లో విలేకరులే మమ్మల్ని కొట్టాలని చూశారు... ప్రెస్ మీట్ పెట్టేందుకే భయపడ్డాను!: సోము వీర్రాజు

  • బాబుది ఓ వైపు సమన్యాయం, మరోవైపు సమైక్యవాదం
  • విభజన వేళ ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలే లేరు
  • అప్పట్లో మీడియా ముందుకు రావడానికే భయపడ్డాం 
  • బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఓ వైపు సమన్యాయం, మరోవైపు సమైక్యవాదం అంటూ చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని, అసలు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం ఆయనేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, నాడు విభజనకు తాను అనుకూలమేనని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను చూపించి పలు విమర్శలు గుప్పించారు. అప్పట్లో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారే తప్ప, ఏపీలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు.

ఏపీ విభజనకు ముందున్న పరిస్థితిని గుర్తు చేసిన ఆయన, "చంద్రబాబువి ఏంటీ డబుల్ స్టాండర్డ్స్? కానీ, మేము... మీరందరూ మమ్మల్ని కొట్టడానికి సిద్ధపడ్డారు. పత్రికా మిత్రులు అందరూ కూడా.. ఎవరయ్యా మీరు? మీకు ఏముంది ఇక్కడ? మీరు వచ్చి విడిపోదామంటారా? అంటూ పడ్డారు. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడ్డాం. మాది వాస్తవాలను ఎప్పుడూ ఒప్పుకునే పార్టీ.

ఏపీ ఏర్పడిన తరువాత హైదరాబాద్ లో రాయలసీమోళ్లే ముఖ్యమంత్రులు. హైదరాబాద్ నే అభివృద్ధి చేశామని చెబుతారు. వీరేమైనా ప్రస్తుత ఏపీలోని 13 జిల్లాల గురించి ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమి కావాలని మీరు ఆవేళ అడిగారు. వెంకయ్యనాయుడుగారు ఆరోజు ఐదేళ్లు, పదేళ్లు కాదు... పదిహేనేళ్లు కావాలని అడిగారు. ఆయన అడిగిన తరువాతే వీళ్లంతా వచ్చారు. హోదాకు బదులు ప్యాకేజీ మూడు వేల కోట్లు చాలన్నారు. ఇప్పుడీ విధంగా ఎందుకు చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు బిల్లులో ఐదేళ్లని పెట్టారని గుర్తు చేస్తూ, నాడు ఐదేళ్ల స్థానంలో పదిహేనేళ్లని పెట్టించేందుకు టీడీపీ ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News