kaleswaram project: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. కోర్టుకు హాజరైన హరీష్ రావు!
- కాళేశ్వరం ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- కాంగ్రెస్ పై మండిపడ్డ హరీష్ రావు
- ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని హితవు
కాళేశ్వరం నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో హరీష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆయన మండిపడ్డారు.
ప్రాజెక్టు నిలుపుదల కోసం కోర్టుల్లో సుమారు 100 కేసులు వేశారని... చివరకు న్యాయమే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ఆకుపచ్చని తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని... ప్రాణత్యాగానికే సిద్ధమైన కేసీఆర్ కు పదవులు ఒక లెక్క కాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రైతాంగం గెలిచిందని అన్నారు.