love: బస్సు కింద పడేందుకు యువకుడి యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ ముందు ఘటన
- ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు
- చివరకు ప్రేమికుడితో ఉండనని చెప్పిన యువతి
- మనస్తాపానికి గురైన యువకుడు
విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ ముందు ఓ యువకుడు హల్చల్ చేశాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి.. రెండు రోజులకే తనను విడిచివెళ్లిపోతానని చెప్పడంతో బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయాడు ఆ యువకుడు. ఆయనను పోలీసులు, కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, అనస్ అనే ఓ యువకుడు ఇస్లాంపేటలో ఉంటున్నాడు. తమ వీధిలోనే ఉంటోన్న ఓ అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. చివరకు ఆమెతో కొంత కాలం ప్రేమాయణం కొనసాగించి, రెండు రోజుల క్రితం ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారిరువురూ సీపీని ఆశ్రయించి, తమ పెద్దల నుంచి రక్షణ కావాలని కోరారు. దీంతో ఈ కేసును సీపీ కొత్తపేట పోలీసులకు అప్పగించారు. అమ్మాయి మేజరా? కాదా? అని నిర్ధారించుకోవడానికి పోలీసులు పదో తరగతి మార్కుల జాబితా తీసుకురావాలని ఆమెకు చెప్పారు.
అంతవరకు బాగానే వున్నా.. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎందుకో తన మనసు మార్చుకుంది. తన భర్తతో వెళ్లబోనని చెప్పేసింది. ఇంత జరిగాక చివరికి ఆ అమ్మాయి తనను కాదన్నందుకు ఆ యువకుడు పోలీస్స్టేషన్ బయటకు వచ్చి రోడ్డుపై సిటీ బస్సు చక్రాల కింద తలపెట్టేందుకు యత్నించాడు. ప్రేమికులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.