Narendra Modi: మోదీని బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు.. బీజేపీతో పొత్తు అంశాన్ని తేల్చేస్తాం: రాయపాటి
- మోదీపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది
- ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీని నమ్ముతాం
- మోకాళ్ల యాత్ర చేసినా జగన్ అధికారంలోకి రాలేడు
ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని బీజేపీకి చెందిన నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయనపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతలు ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీని మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీని నమ్ముతామని చెప్పారు.
రాజీనామాలు చేయడానికైనా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికైనా తాము సిద్ధమేనని అన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలిపోతుందని చెప్పారు. తమ అధినేత చంద్రబాబు మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 2019లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. పాదయాత్ర కాదు, మోకాళ్లయాత్ర చేసినా జగన్ అధికారంలోకి రాలేడని ఎద్దేవా చేశారు. ఏపీకి న్యాయం జరగాలనే ఆకాంక్షతో పవన్ కల్యాణ్ పోరాడుతున్నారని... ఆయనకు టీడీపీ సహకారం ఉంటుందని చెప్పారు.