New Delhi: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత
- ఆప్ నేతలు తనపై దాడి చేశారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇటీవల ఫిర్యాదు
- సీసీ ఫుటేజ్ కోసం కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు
- భారీగా చేరుకున్న పోలీసులు, ఆప్ కార్యకర్తలు
- పోలీసులు ఇంతటి శ్రద్ధ జడ్జి బీహెచ్ లోయ మృతిలో దర్యాప్తుపై చూపితే బాగుండేది: కేజ్రీవాల్
ఇటీవల ఓ సమావేశానికి హాజరైన తనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దాడి చేశారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న ఢిల్లీ పోలీసులు ఈ రోజు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు అనుకున్నారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అలజడి చెలరేగింది. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి అరుణోదయ ప్రకాశ్ ఈ విషయంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 60 నుంచి 70 మంది పోలీసులు కేజ్రీవాల్ నివాసానికి వచ్చారని చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు ఈ రోజు తన ఇంట్లో సోదాలు చేయడంలో చూపించినంత శ్రద్ధ జడ్జి బీహెచ్ లోయ మృతిలో దర్యాప్తుపై చూపితే బాగుండేదని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇంట్లోనూ సోదాలు చేస్తే పోలీసులను చూసి దేశ ప్రజలు గర్వించేవారని వ్యాఖ్యానించారు.