Twitter: ట్విట్టర్ గురించి కవిత రాసిన బాలీవుడ్ షెహన్ షా!
- గతంలో ఫాలోవర్లను తగ్గించిందని ట్విట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బి
- ట్విట్టర్ పై తాజాగా కవిత రచించిన షెహన్ షా
- ఆకట్టుకుంటున్న కవిత
బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ నటనతో పాటు రచయిత, సింగర్ గా కూడా అప్పుడప్పుడు అలరిస్తుంటారన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వివిధ అంశాలపై స్పందించే అమితాబ్ ఆ మధ్య తన ఫాలోవర్ల సంఖ్య తగ్గించిందని ట్విట్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘నాకు ట్విట్టర్ వద్దు.. నేను తప్పుకుంటున్నా’ అంటూ వ్యాఖ్యానించారు కూడా. అంత మండిపడిన అమితాబ్ తాజాగా ట్విట్టర్ పై హిందీలో ఒక కవితను రాసి, తన అకౌంట్లో పోస్టు చేశారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
దాని వివరాల్లోకి వెళ్తే... ‘మిస్టర్/మిస్ ట్విట్టర్ నీకు డెడికేట్ చేస్తున్నా...ట్విట్టర్ నేను ఏదైనా పోస్ట్ చేద్దామనుకుంటే నువ్వు నన్ను అనుమతించట్లేదు. ఇప్పటికే 2లక్షల మంది నా ఫాలోవర్లను తగ్గించేశావు. కనీసం నీ కోసం నేను పోస్ట్ చేసిన ఈ కవిత్వాన్ని మాత్రం తొలగించకు. నాతో ఇంత దారుణంగా ప్రవర్తించకు. ఓ పక్షి! (ట్విట్టర్ లోగో) నీ నివాసం ఎక్కడ? ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చావు. నీకు ఎందరో అభిమానులున్నారు. భయమనేదే లేదు నీకు. కానీ నీకు కోపం వస్తే మేమెక్కడికి వెళ్లాలి? నీ ఆశీర్వాదాలు మాపై ఉంటే మా పదాలను పువ్వుల్లా నీపై కురిపిస్తాం’ అంటూ ముగించారు. ఇది ఆయన అభిమానులను అలరిస్తోంది.
కాగా, అమితాబ్ కు ట్విట్టర్ లో 32,902,353 మంది ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 32,944,338. తాజాగా అమితాబ్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు సెలబ్రిటీలు, కాంగ్రెస్ లీడర్స్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. దీంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న సంగతి తెలిసిందే.