Rajasthan Assembly: రాజస్థాన్ అసెంబ్లీలో విడ్డూరం...దెయ్యాలపై చర్చించిన నేతలు!
- అసెంబ్లీ ప్రాంగణంలో దెయ్యాలున్నాయని ఆందోళన
- గత ఆరు నెలల్లో ఇద్దరు శాసనసభ్యుల మృతి!
- శుద్ధి కార్యక్రమాలు జరిపించాలని స్పీకర్‌కు వినతి
- ఇదే అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని చీఫ్ విప్ సరదా వ్యాఖ్య
రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం ఓ చిత్రమైన అంశంపై చర్చ జరిగింది. శాసనసభ ప్రాంగణంలో ఎంఎల్‌ఏలు దెయ్యాల ఉనికి గురించి మాట్లాడారు. శుద్ధి కార్యక్రమాలను జరిపించాలని స్పీకర్‌ను కోరారు. మధ్యాహ్నం 12 గంటల లోపు సమావేశాలను ముగించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీ భవనంలో దెయ్యాలున్నట్లు చర్చ జరుగుతోందని, శుద్ధి కార్యక్రమాలను జరపాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ఓతారామ్ దేవసిని పలువురు సభ్యులు కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై ఓ విచారణ కమిటీని వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ కాలులాల్ గుర్జర్ సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
చర్చ సాగుతుండగా స్పీకర్ మేఘ్వాల్ జోక్యం చేసుకుని దెయ్యాల అంశంపై ప్రత్యేకంగా చర్చ జరగాలని చెప్పారు. కాగా, గురువారం బీజేపీ ఎంఎల్ఏ హబీబుర్ రెహ్మాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ...ఈ ప్రాంగణంలో లోపల కొంతభాగం ఒకప్పుడు శ్మశానవాటిక ఉండేదని, అందువల్ల అసెంబ్లీ భవనంలో దెయ్యాలు ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన మాటలతో మిగతా ఎంఎల్ఏలు కూడా ఏకీభవించారు. రాజస్థాన్ అసెంబ్లీ భవనాన్ని జ్యోతి నగర్‌లోని దాదాపు 16.96 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌ని ఆనుకునే లాల్ కోఠి శ్మశాన వాటిక ఉంది. కాగా, గత ఆరు నెలల్లో ఇద్దరు శాసనసభ్యులు మరణించిన నేపథ్యంలో సభ్యులు ఇలా దెయ్యాల ఉనికిపై చర్చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.