team india: చరిత్రనెలకొల్పిన టీమిండియా... టీ20 సీరీస్ కూడా టీమిండియాదే!
- ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు
- వన్డే, టీ20 సిరీస్ లు సొంతం చేసుకుని రికార్డు నెలకొల్పిన భారత్
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సురేష్ రైనా
టీమిండియా చరిత్ర నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై రెండు సీరీస్ ల విజయాలు సొంతం చేసుకుని సత్తాచాటింది. టెస్టు సీరీస్ లో పేలవ ప్రదర్శనతో సఫారీ బౌలర్ల ముందు నిలువలేకపోయిన టీమిండియా చివరి టెస్టు విజయంతో పుంజుకుంది. అనంతరం జరిగిన వన్డే సీరీస్ ను 5-1 తేడాతో సొంతం చేసుకుని పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ స్థానానికి ఎగసింది. తాజాగా జరిగిన టీ20 సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుని, సౌతాఫ్రికాపై తమదే పైచేయి అని సగర్వంగా చాటుతూ, తమకు స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా తిరుగులేదని నిరూపించింది.
నిన్న రాత్రి జరిగిన చివరి టీ20 వివరాల్లోకి వెళ్తే... వెన్నునొప్పితో బాధపడుతూ కోహ్లీ మ్యాచ్ కు దూరంకావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభమే లభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (47 ) ధాటిగా ఆడగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సురేశ్ రైనా (43) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం సఫారీలు డుమిని (55 ) కెప్టెన్ ఇన్నింగ్స్ తో దూకుడు ప్రదర్శించగా, అరంగేట్ర ఆటగాడు జాంకర్ (49 ) భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు విజయాలతో టీ20 సీరీస్ ను సొంతం చేసుకుంది.