sridevi: శ్రీదేవి మరణంపై స్పందనలు... ట్విట్టర్ వేదికగా ప్రధాని తదితర ప్రముఖుల సంతాపం
- సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
- ప్రియ స్నేహితురాలిని కోల్పోయానన్న రజనీకాంత్
- ఆమె జోలపాట బాధపెడుతుందన్న కమలహాసన్
శ్రీదేవి అకాలమరణం ప్రముఖులను దిగ్ర్భాంతికి గురి చేసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ట్విట్టర్ వేదికపై సంతాపం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శ్రీదేవి మరణం పట్ల కలత చెందారు. శ్రీదేవి మరణ వార్త షాక్ కు గురిచేసిందన్నారు. ‘‘లక్షలాది అభిమానుల గుండె పగిలే వార్తతో ఆమె విడిచిపెట్టి వెళ్లారు. మూడ్రమ్ పిరై, లమ్హే, ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలు ఇతర నటులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా సానుభూతి’’ అంటూ రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి
శ్రీదేవి అకాల మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తెలుగు, దక్షిణాది సినిమాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించిన ఆమెను ఎంతో బహుముఖ, వైవిధ్య ప్రతిభ కలిగిన నటిగా కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ప్రధాని
ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక, అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఎంతో సీనియర్ అయిన ఆమె వైవిధ్య పాత్రలతో, చిరస్మరణీయ నటన ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ సమయంలో తన ఆలోచనలన్నీ ఆమె వెంటే ఉన్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
రజనీకాంత్
‘‘నేను షాక్ కు గురయ్యా. కలత చెందా. నా ప్రియమైన స్నేహితురాలిని కోల్పోయాను. పరిశ్రమ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా సానుభూతి’’ అని తమిళ అగ్రనటుడు రజనీకాంత్ ట్వీట్ చేశారు.
కమలహాసన్
‘‘బాల నటి నుంచి అద్భుతమైన మహిళ వరకు ఆమె ఎదిగిన తీరును చూశాను. ఆమె నటకీర్తి వాస్తవం. ఆమెతో ఉన్న మధుర క్షణాలు నాకు గుర్తుకు వచ్చాయి. ఆమె జోలపాట నన్ను ఇప్పుడు బాధకు గురిచేస్తోంది’’ అని మరో అగ్ర నటుడు, శ్రీదేవితో ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటించిన కమలహాసన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
శిల్పాశెట్టి
‘‘నేను షాక్ లో ఉన్నా. గుండె పగిలే వార్త నుంచి తేరుకోలేకున్నా. ఎంతో అందమైన ఆమె మనసుకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అంటూ శిల్పాశెట్టి ట్వీట్ చేశారు. శ్రీదేవితో కలసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.
కత్రినాకైఫ్
‘‘నమ్మశక్యం కాని విషాదం ఇది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు’’ అని కత్రినాకైఫ్ ట్వీట్ చేశారు.
రిషి కపూర్
‘‘విషాద వార్తతో నిద్రలేచా. పూర్తిగా షాకింగ్. బాధాకరం. బోనీకపూర్, వారిద్దరి కుమార్తెలకు హృయదపూర్వక సానుభూతి’’ అంటూ రిషి కపూర్ ట్వీట్ చేశారు.
సుస్మితాసేన్
‘‘శ్రీదేవి హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్టు ఇప్పుడే తెలిసింది. నేను షాక్ కు గురయ్యా. ఏడవకుండా ఉండలేకపోతున్నా’’ అని సుస్మితాసేన్ పేర్కొన్నారు.