US President Donald Trump: దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకుంటాం... అమెరికాకి ఉ.కొరియా వార్నింగ్!
- మాపై ఆంక్షలను యుద్ధ ప్రకటనగానే భావిస్తాం
- మాకు అణ్వాయుధాలున్నాయి
- డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల నిర్ణయంపై ప్యాంగ్యాంగ్ వార్నింగ్
అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మిత్ర దేశాల సూచనలు, సలహాలతో ఇరు దేశాలు వెనక్కి తగ్గినట్లు అనిపించినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది. తమపై అమెరికా కనీవినీ ఎరుగని రీతిలో ఆంక్షల విధింపుకు సిద్ధపడటాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈ రోజు తెలిపింది.
తమపై అమెరికా ఆంక్షలను అమలు చేస్తే దానిని 'యుద్ధ ప్రకటన' గానే తాము భావించాల్సి ఉంటుందని మరోసారి హెచ్చరించింది. నిషేధిత అణ్వాయుధ కార్యక్రమాలను ఉత్తరకొరియా తిరిగి చేపట్టకుండా నిరోధించేందుకు అమెరికా తాజా ఆంక్షలకు సిద్ధమవుతోంది. ఈ ఆంక్షల వల్ల ఉత్తర కొరియాతో సంబంధమున్న దాదాపు 50కి పైగా షిప్పింగ్ కంపెనీలు, ఓడలు, వర్తక వ్యాపారాలు ప్రభావితమయ్యే అవకాశముంది.
"మేం పదే పదే చెబుతున్నట్లుగా.... మాపై ఎలాంటి ఆంక్షలను విధించినా దానిని మేం యుద్ధ ప్రకటనగానే భావించాల్సి ఉంటుంది" అని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసినట్లు ఆ దేశ అజమాయిషీలో నడుస్తున్న కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఒకవేళ అమెరికా తమ దేశంపై దుందుడుకు చర్యలకు దిగితే తాము ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ఉత్తర కొరియా ప్రతినబూనింది. అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు తమకు అణ్వాయుధాలు వున్నాయని తెలిపింది. కాగా, ఉత్తరకొరియాపై భారీ స్థాయిలో అమలు చేయనున్న ఆంక్షలు సరైన ఫలితాలను ఇవ్వని పక్షంలో తదుపరి దశ చర్యలకు పూనుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించిన నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ మేరకు ప్రతి హెచ్చరిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.