Rahul Gandhi: పంజాబ్ కుంభకోణం విషయంలో రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
- ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా
- తాను చేస్తోన్న ఆరోపణలను రాహుల్ నిరూపించాలి
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రోజు ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా... బీజేపీ సర్కారు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్తల రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్ గాంధీ చెబుతోన్న మాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని, తమ సర్కారు రైతుల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
తాను చేస్తోన్న ఆరోపణలను రాహుల్ నిరూపించాలని సవాల్ విసిరారు. తాము అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధమేనని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో రాహుల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమాత్రం మంచి చేయలేకపోయారని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే చెరకు రైతుల కష్టాలు తీరుతాయని, ఉత్తరప్రదేశ్ లో చేసినట్లే ఇక్కడ కూడా రైతుల రుణాలు మాఫీ చేస్తామని, ఇది తమ మానిఫెస్టోలోనే ఉందని తెలిపారు. బీదర్‌లోని చెరకు ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు.