south korea: అమెరికాతో చర్చలకు సిద్ధం: సంచలన ప్రకటన చేసిన ఉత్తరకొరియా
- ఆంక్షలు విధిస్తే దానిని యుద్ధంగా పరిగణిస్తామన్న ఉ.కొరియా
- బెదిరింపులకు తలొగ్గని అమెరికా, ఆంక్షల విధింపు
- వెంటనే చర్చలకు సిద్ధమంటూ ప్రకటన
ఉత్తరకొరియాపై ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు సత్ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అమెరికా ఆంక్షలు విధిస్తే దానిని తాము యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా... ఆ కాసేపటికే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ కొరియాలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్ క్రీడల ముగింపు ఉత్సవానికి వచ్చిన ఉత్తరకొరియా ప్రత్యేక బృందం... అమెరికాతో సంబంధాలపై స్పందిస్తూ, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
అంతేకాకుండా, ఈ బృందం ఒలింపిక్ సిటీలో ఎవరికీ తెలియని చోట దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో సమావేశమైంది. ఈ సమయంలో అమెరికాతో కయ్యానికి కాలుదువ్వకుండా సామరస్యంగా ముందుకెళ్లాలని ఆయన వారికి సూచించినట్టు తెలుస్తోంది. కాగా, వింటర్ ఒలింపిక్స్ ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు బాగా పనిచేసినట్లు అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.