Sridevi: ఇంకా ముంబై చేరని శ్రీదేవి మృతదేహం... !
- దుబాయ్ పత్రికలలో ప్రముఖంగా శ్రీదేవి మరణ వార్త
- శవ పరీక్ష నివేదిక రావడానికి 24 గంటల సమయం పడుతుంది
- ఈ విషయంలో దుబాయ్ నిబంధనలు కఠినం
ప్రముఖ సినీనటి శ్రీదేవి నిన్న రాత్రి దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్ నిబంధనల ప్రకారం శవపరీక్షలో జరిగిన జాప్యం కారణంగా శ్రీదేవి మృతదేహం ఇంకా ముంబై చేరలేదు. దుబాయ్ లో శవపరీక్ష పూర్తయిందనీ, ఫోరెన్సిక్ ఆధారాల విభాగం నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. యూఏఈ నిబంధనల ప్రకారం ఆసుపత్రి వెలుపల ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే వివిధ రకాల పరీక్షలు పూర్తయి, నివేదికలు రావడానికి 24 గంటల సమయం పడుతుందని తెలుస్తోంది.
ఆ నివేదికలు వచ్చిన తరువాతే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారని సమాచారం. శ్రీదేవి మృతదేహం స్వదేశం చేరడంలో జాప్యానికి కారణం అదేనని తెలుస్తోంది. కాగా, దుబాయ్ లోని వార్తా పత్రికల్లో శ్రీదేవి మృతి వార్త ప్రముఖంగా వెలువడింది. వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి హోటల్ లోని స్నానపుగదిలో కళ్లుతిరిగి పడిపోయారని, ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందారని, ఆమెను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రషీద్ ఆసుపత్రికి తరలించారని స్థానిక వార్తాపత్రికలు తెలిపాయి.