dravid: ద్రవిడ్ అంటే ఇందుకే నాకు అభిమానం: మంత్రి కేటీఆర్
- అండర్-19 జట్టుకు కోచ్ గా ద్రవిడ్
- అందరికీ సమాన పారితోషికం కోసం డిమాండ్
- ఫలించిన ద్రవిడ్ డిమాండ్... దిగొచ్చిన బీసీసీఐ
- ఈ అంశాన్ని తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ క్రికెటర్ ద్రవిడ్ అంటే తనకు ఎందుకు అభిమానమో తెలియజేశారు. ‘‘ఇందుకే రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్ మాత్రమే కాకుండా నా అభిమాన వ్యక్తి కూడా’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కింద ఆయన ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ద్రవిడ్ పై వచ్చిన ఓ ఆర్టికల్ క్లిప్పింగ్ ఉంచారు. అందులో ద్రవిడ్ గొప్ప వ్యక్తిత్వాన్ని చాటే అంశాలున్నాయి.
అండర్-19 భారత జట్టుకు ద్రవిడ్ చీఫ్ కోచ్ గా చక్కని మార్గదర్శకం చూపించి ప్రపంచ కప్పు గెలుపునకు కారణమైన విషయం తెలిసిందే. అయితే కోచింగ్ టీమ్ లో తనకు రూ.50 లక్షలు మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించడంతో ద్రవిడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి వివక్ష తగదని అందరికీ సమాన పారితోషికం ఉండాలని సూచించాడు. రాహుల్ ద్రవిడ్ సూచనలతో బీసీసీఐ ద్రవిడ్ సహా ప్రతీ సభ్యుడికీ రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తన రెమ్యునరేషన్ తగ్గినా గానీ సమానత్వం కోసం ద్రవిడ్ తీసుకున్న చొరవ అభినందనీయం. దీన్నే పరోక్షంగా కేటీఆర్ గుర్తు చేశారు