Chandrababu: 'రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండండి'.. చంద్రబాబు, జగన్‌లకు రఘువీరారెడ్డి లేఖలు
- వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు
- రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపుతోంది
- కేంద్రం తీరు పట్ల ప్రజల అసంతృప్తి- రఘువీరారెడ్డి
వచ్చేనెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ, వైసీపీ దూరంగా ఉండాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి నిరసన తెలపాలని చంద్రబాబు, జగన్‌లకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతోన్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని లేఖలో ఏపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తెలుగు దేశం పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కుతాయని, ప్రస్తుతం ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన టీడీపీ వాటిని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఏమీ లేదని, పార్టీకి దక్కాల్సిన స్థానాలు ఎప్పటికైనా దక్కుతాయని ఆయన తెలిపారు. అలాగే వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆ పార్టీకి దక్కాల్సిన ఒక స్థానం కూడా ఎక్కడికీ పోదని, ఎప్పటికైనా వస్తుందని రఘువీరా అన్నారు. ఎన్నికలకు దూరంగా ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచొచ్చని చెప్పారు.