Telangana: 13,694 ఆర్‌ఆర్‌బీ పోస్టుల కోసం.. తెలంగాణ అభ్యర్థులకు టీ-సాట్‌లో శిక్షణ

  • 1,07,082 ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్
  • అందులో సికింద్రాబాద్ జోన్ కు 13,694 పోస్టులు
  • ప్రత్యేక శిక్షణ అందించాలన్న మంత్రి కేటీఆర్‌
  • రేపటి నుంచి టీ-సాట్ ప్రత్యేక శిక్షణ

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) భర్తీ చేయనున్న లక్షకు పైగా ఉద్యోగాల్లో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ కు 13,694 పోస్టులు లభించాయని టీ-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉద్యోగాలను పొందేందుకు అధిక అవకాశాలున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని సీఈవో తెలిపారు.

ఇటీవలే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు లోకో పైలట్, టెక్నిషియన్స్, గ్రూప్-డీ విభాగాల్లో సుమారు 1,07,082 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, అందులో సికింద్రాబాద్ జోన్ కు 13,694 ఉద్యోగాలున్నాయని శైలేష్ రెడ్డి తెలిపారు. ఇవే కాకుండా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరిలో ఇతర జోన్లలో 93,388 ఉద్యోగాలున్నాయన్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో సికింద్రాబాద్ జోన్ కు సంబంధించిన 13,694 ఖాళీలకు తెలంగాణ యువతను సిద్ధం చేసేందుకు టీ-సాట్ ప్రత్యేక శిక్షణ అందించాలని కేటీఆర్‌ సూచించారని శైలేష్ రెడ్డి తెలిపారు.

మారు మూల ప్రాంత, పేద విద్యార్థులకు సహాయపడేందుకు అనుభవం కలిగిన సిబ్బందితో పోటీ పరీక్షల పాఠ్యాంశాలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మంత్రి సూచనల మేరకు టీ-సాట్ తొలుత రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆర్‌ఆర్‌బీ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో లోకో పైలెట్ 3,273, టెక్నీషియన్స్ 3,898, గ్రూప్-డీలో 6,323 ఉద్యోగాలున్నాయని, వీటికి టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులకే ఎక్కువ అవశాలున్నాయని సీఈవో వివరించారు.

టీ-సాట్ టోల్ ఫ్రీ నెంబర్లు...
రేపు టీవీలో చేయనున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ద్వారా అనుమానాలను నివృతి చేసుకునేందుకు 040 23553473, 040 23551989 టోల్ ఫ్రీ నెం.1800 425 4038 నెంబర్లకు అభ్యర్థులు కాల్ చేయవచ్చని సీఈవో శైలేష్ రెడ్డి సూచించారు. దరఖాస్తుకు లోకో పైలెట్స్ కు మార్చి 4వ తేది, గ్రూప్-డి ఉద్యోగాలకు మార్చి 12వ తేది చివరి రోజు కాగా పరీక్ష తేదీ మే నెలలో ఉండే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ నిరుద్యోగ యువతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా టీ-సాట్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నిరుద్యోగ యువతను ఈ ఉద్యోగాలకు సమాయత్తం చేసేందుకు టీ-సాట్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని, ఈ అవకాశాన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి కోరారు.

  • Loading...

More Telugu News