Hyderabad: విషపు ఇంజక్షన్ తీసుకుని తనువు చాలించిన వైద్యురాలు.. హైదరాబాద్‌లో విశాఖ వైద్యురాలు ఆత్మహత్య
- సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లక్ష్మి
- నెల రోజుల క్రితం పదోన్నతిపై సిద్ధిపేట ఆసుపత్రికి ట్రాన్స్ఫర్
- ఫ్లాట్‌లో ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్య
హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన ఓ వైద్యురాలు విషపు ఇంజక్షన్ తీసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన ఎం.నూకరాజు కుమార్తె డాక్టర్ ఎంవీవీ లక్ష్మి (42) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి సైనిక్‌పురిలోని హస్తినాపురిలో ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, సివిల్ సర్జన్‌గా చేస్తున్న లక్ష్మి నెల రోజుల క్రితం పదోన్నతిపై సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
అవివాహిత అయిన లక్ష్మి రెండు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. అపార్ట్మెంట్లోనూ ఆమె కనిపించకపోవడంతో ఊరెళ్లి ఉంటారని అందరూ భావించారు. అయితే, మంగళవారం ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన పక్క ఫ్లాట్ వారు వాచ్‌మన్‌కు సమాచారం అందించారు. ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపల తాళం వేసినట్టు గుర్తించారు.
దీంతో అపార్ట్మెంట్ అధ్యక్షుడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి చూడగా లక్ష్మి మృతదేహం కనిపించింది. ఆ పక్కనే 2 ఇంజక్షన్ సీసాలు, సిరంజులు ఉండడంతో ఆమె వాటిని తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖపట్టణంలో ఉంటున్న లక్ష్మి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.