Undertrials: గోరఖ్‌పూర్ జైలులో 'హెచ్ఐవీ' ఖైదీలు
- 23 మంది విచారణ ఖైదీలకు వైరస్ ఉన్నట్లు వెల్లడి
- కారణాలు తెలుసుకోవడం కష్టమన్న జైలు సూపరింటెండెంట్
- యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తిస్తామన్న ఐజీ
గోరఖ్‌పూర్ జైలులో దాదాపు 23 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. యూపీలోని ఉన్నావో జిల్లా, బంగార్‌మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మంది ఈ వ్యాధిబారిన పడినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జైలు ఖైదీలకు కూడా హెచ్ఐవీ ఉందన్న విషయం బహిర్గతమవడం గమనార్హం. హెచ్ఐవీ ఖైదీల్లో ఎక్కువ మంది విచారణ ఖైదీలేనని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు.
పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (యూపీఎస్ఏసీఎస్) సిబ్బంది పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు నిర్వహించామని గోరఖ్ పూర్ జైలు సూపరింటెండెంట్ రంధానీ మిశ్రా తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందని ఆయన చెప్పారు. వారందరూ ప్రస్తుతం బీఐర్‌డీ వైద్య కళాశాలలోని ఏఆర్‌టీ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. జైలులోని విచారణ ఖైదీలకు అసలు హెచ్ఐవీ సోకడానికి గల కారణాలను మాత్రం చెప్పలేకపోతున్నామని మిశ్రా అన్నారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు.