aircel: ఎయిర్ సెల్ కస్టమర్లకు ఊరట... చేరి 90 రోజులు అవకపోయినా పోర్టింగ్ కు అవకాశం
- పలు సర్కిళ్లలో సేవలు నిలిపివేత
- ఇతర సర్కిళ్లలోనూ కస్టమర్లకు ఇబ్బందులు
- నివేదికకు ఆదేశించిన ట్రాయ్
- కస్టమర్లు సులభంగా బయటకు వెళ్లేందుకు అవకాశం
టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్, ఎయిర్ సెల్ సంస్థ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టమర్లు తమ ఖాతాల్లో వాడుకోకుండా మిగిలి ఉన్న బ్యాలన్స్ పై నివేదిక ఇవ్వాలని ఎయిర్ సెల్ ను ఆదేశించింది. అలాగే, ఎయిర్ సెల్ నెట్ వర్క్ నుంచి పోర్ట్ ద్వారా బయటకు వెళ్లేందుకు 90 రోజుల గడువు నుంచి మినహాయింపు కూడా ఇచ్చింది. అంటే కొత్తగా ఎవరైనా ఎయిర్ సెల్ నెట్ వర్క్ లో చేరి లేదా పోర్ట్ ద్వారా ఎయిర్ సెల్ కు మారి 90 రోజులు పూర్తి కాకపోయినప్పటికీ వారు ఎయిర్ సెల్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.
ఎయిర్ సెల్ కు 8 కోట్ల కస్టమర్లు ఉన్నారు. తీవ్ర నష్టాల కారణంగా సేవలను నిలిపివేయాలని ఈ సంస్థ నిర్ణయించిన విషయం తెలిసిందే. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ (వెస్ట్) సర్కిళ్లలో గత నెల 31 నుంచే సేవలు ఆపేస్తున్నట్టు తెలిపింది. అయితే, ఇతర రాష్ట్రాల్లోని కస్టమర్లకు సైతం ఎయిర్ సెల్ నెట్ వర్క్ పరిధిలో సమస్యలు ఎదురవుతుండడం ట్రాయ్ దృష్టికి వచ్చింది. దీంతో తాజా ఆదేశాలు జారీ చేసింది.