Congress: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో తన స్థానాలను నిలుపుకున్న కాంగ్రెస్!
- రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్న కాంగ్రెస్
- ఒడిశాలో ఓటమి.. మూడో స్థానంతో సరి
- కాంగ్రెస్ మెజారిటీని భారీగా తగ్గించగలిగామన్న సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌లోని ముంగోలి, కోలారస్ అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తమ స్థానాలను కాపాడుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేబినెట్ మంత్రులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ బీజేపీకి ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్నప్పటికీ ఆధిక్యం భారీగా తగ్గడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఒడిశాలో ఓ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ అధికార బీజేడీ విజయం సాధించగా బీజేపీ రెండు, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహా 36 మంది కేబినెట్ మంత్రుల్లో 21 మంది వారాల తరబడి ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం వ్యతిరేకంగా రావడం బీజేపీ శ్రేణులను కలచివేస్తోంది.
ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరైన జ్యోతిరాదిత్య సింధియాకు పట్టున్న ప్రాంతాలు కావడం గమనార్హం. తాజా ఫలితాలపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ 2013 ఎన్నికలతో పోలిస్తే తమ మెజారిటీ బాగా పెరిగిందని అన్నారు. ఇవి కాంగ్రెస్ స్థానాలే అయినప్పటికీ వారి మెజారిటీ భారీగా పడిపోయిందన్నారు.