Donald Trump: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరిట నామినేషన్?
- 2018 నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్
- పేరు చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తి ప్రతిపాదన
- మొత్తం 329 నామినేషన్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట నోబెల్ శాంతి బహుమతికి మోసపూరిత నామినేషన్ వచ్చిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. దీనిపై ఇతర వివరాలు పోలీసు విచారణలో తేలుతాయని కమిటీ స్పష్టం చేసింది. ప్రతి ఏటా నోబెల్ బహుమతికి సంబంధించిన నామినేషన్లు జనవరి 31 లోగా ముగుస్తాయి. వీటికి అభ్యర్థులను నార్వే ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యులు, నోబెల్ గ్రహీతలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రతిపాదించవచ్చు.
నామినేట్ అయిన వారి పేర్లను నోబెల్ కమిటీ 50 సంవత్సరాల వరకు రహస్యంగా ఉంచుతుంది. అయితే నామినేట్ అయినవారు మాత్రం ఆ విషయాన్ని బట్టబయలు చేయవచ్చు. ఇతరులు దానిపై బయటకు చెప్పడం నేరం. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారట. పేరు చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తి ద్వారా ఈ నామినేషన్ దాఖలైనట్టు తెలుస్తోంది. కాగా, 2018 శాంతి బహుమతి కోసం 329 నామినేషన్లు వచ్చాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. నోబెల్ బహుమతి గెలుచుకున్న వారి పేర్లను అక్టోబర్ మొదటి వారంలో వెల్లడిస్తారు.