Kamal Haasan: మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది: కమలహాసన్

  • మద్యాన్ని ఒకేసారి మానివేయడానికి మనిషి శరీరం సహకరించదు
  • ఒక్కసారిగా బ్యాన్ చేయడానికి అది గాంబ్లింగ్ కాదు
  • దేన్నైనా పూర్తిగా నిషేధిస్తే మాఫియా పుట్టుకొస్తుంది

  సినీ నటుడి నుంచి పొలిటీషియన్ గా మారిన కమలహాసన్ సంపూర్ణ మద్యపాన నిషేధంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 'మక్కల్ నీధి మయ్యమ్' పార్టీని ఇటీవలే ప్రకటించిన కమల్... తన పార్టీ విధివిధానాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. ఉచితంగా ఏదీ ఇవ్వడానికి తాను ఇష్టపడనని ఆయన చెప్పారు.

తమిళనాడులో పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో వెతుక్కుంటూ పోవాలని... అదే టాస్మాక్ (తమిళనాడు ప్రభుత్వ మద్యం దుకాణాలు) మాత్రం ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయని... ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని కమల్ చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో... కమల్ తన అభిప్రాయాలను స్పష్టం చేశారు.

తమిళ మేగజీన్ ఆనంద వికటన్ లో ఆయన ఈ మేరకు కాలమ్ లో పేర్కొన్నారు. సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ మద్యాన్ని అసహ్యించుకునేలా చేయడం అసంభవమని ఆయన అన్నారు. దేన్నైనా సంపూర్ణంగా నిషేధిస్తే మాఫియా పుట్టుకొస్తుందని... ఇలాంటి ఘటనలను ప్రపంచ చరిత్రలో ఎన్నో చూశామని చెప్పారు. మందు తాగడాన్ని హఠాత్తుగా నిషేధించడానికి అది గ్యాంబ్లింగ్ కాదని అన్నారు.

సడన్ గా మద్యాన్ని మానివేయడానికి మనిషి శరీరం సహకరించదని చెప్పారు. మందు తాగడాన్ని క్రమంగా తగ్గించగల ప్రయత్నమైతే చేయవచ్చని... పూర్తిగా ఆపించడం జరుగుతుందని తాను భావించడం లేదని అన్నారు. కేవలం మహిళా ఓటర్లను బుట్టలో వేసుకునేందుకే సంపూర్ణ మద్య నిషేధం నాటకాన్ని రాజకీయ నేతలు ఆడుతున్నారని విమర్శించారు. పాఠశాలల దగ్గర లిక్కర్ షాపులు ఉండటం పట్ల తాను ఎక్కువగా ఆందోళన చెందుతున్నానని చెప్పారు.

ప్రజలకు ఉచితంగా ఏదైనా ఇచ్చే కార్యక్రమాన్ని ఎక్కవ కాలం కొనసాగించలేమని కమల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ప్రజల జీవనస్థాయిని పెంచేందుకు సరైన మార్గాలను అన్వేషించాలని చెప్పారు. విద్యారంగంలో ప్రమాణాలను పెంచడం తమ పార్టీ లక్ష్యాలలో ఒకటని చెప్పారు. 

  • Loading...

More Telugu News