Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పూర్తిగా పరిశీలించాలి : ఏపీ సీఎస్
- ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై సీఎస్ దినేష్ కుమార్ సమీక్ష
- వచ్చిన దరఖాస్తులన్నింటినీ పూర్తిగా పరిశీలించాలి
- స్థలాల లభ్యత మేరకు అర్హులకు ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు
రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయమై అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పూర్తిగా పరిశీలించి.. స్థలాల లభ్యత మేరకు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘మీ కోసం’ పోర్టల్ లో వచ్చిన ధరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లకు పంపి తహసీల్దార్ల ద్వారా వాటిని పూర్తిగా పరిశీలించాలని, అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలు లేదా మేజర్ పంచాయితీల్లో స్థలాల లభ్యత తక్కువగా ఉంటుంది కనుక, అక్కడ ఇళ్ల స్థలాలకు బదులుగా ‘జి ప్లస్ టు ఆపై (వర్టికల్) తరహాలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ‘మీకోసం’ పోర్టల్ లో ఇళ్ల స్థలాల కోసం 18 లక్షల 78 వేల, 970 ధరఖాస్తులు రాగా, ఇప్పటి వరకూ 14 వేల 900 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. మరో 2 లక్షల దరఖాస్తులకు సంబంధించిన వారిలో కొందరు బీపీఎల్ కుటుంబాలకు చెందినవారు కాకపోవడం, మరి కొందరు ఇప్పటికే ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు కలిగి ఉండడం, కొందరికి స్థలం ఉన్నా అది వివాదాస్పదంగా ఉండడం, తగిన డాక్యుమెంట్లను సమర్పించకపోవడం వంటి కారణాలతో ఆ దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించి తిరస్కరించడం జరిగిందని, మిగతా దరఖాస్తులన్నీ పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అదే విధంగా రెగ్యులైజేషన్ పథకం కింద రాష్ట్రంలో 2014 జూన్ నుండి ఇప్పటి వరకూ 2 లక్షల 29 వేల 891 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 2014 జూన్ నుండి ఇప్పటి వరకూ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి లక్షా 73 వేల 526 మంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని అనిల్ చంద్ర పునీత పేర్కొన్నారు.