psl: ఫైనల్ పాకిస్థాన్ లో అయితే నేను ఆడను: కలకలం రేపుతున్న కెవిన్ పీటర్సన్ ప్రకటన
- వీక్షకులు లేక వెలవెలబోతున్న పీఎస్ఎల్
- సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లు పాక్ లో నిర్వహించాలని పీసీబీ నిర్ణయం
- పాక్ లో అయితే రానని తెగేసి చెప్పిన కెవిన్ పీటర్సన్
వీక్షకులు లేక వెలవెలబోతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కు ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ షాక్ ఇచ్చాడు. దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్న సిరీస్ ను స్వదేశానికి తరలిస్తే అభిమానుల ఆదరణ పెరుగుతుందని పీసీబీ భావిస్తోంది. దీంతో టోర్నీ సెమీ ఫైనల్ రెండు మ్యాచ్ లతో పాటు ఫైనల్ ను కూడా పాక్ లో నిర్వహించాలని భావించింది. ఈ విషయాన్ని పీఎస్ఎల్ ఒప్పంద ఆటగాళ్లకు తెలిపింది.
అయితే, పాక్ లో మ్యాచ్ లు నిర్వహిస్తే తాను రానని క్వెట్టా గ్లాడియేటర్స్ తరుఫున ఆడుతున్న కెవిన్ పీటర్సన్ యాజమాన్యానికి తెలిపాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్ కు చేరినా తాను పాక్ లో ఆడనని తెగేసి చెప్పాడు. దీంతో పాక్ బోర్డు అవాక్కైంది. తరువాతి సీజన్ ను పాక్ లోనే నిర్వహించనున్నామని పీసీబీ ఛైర్మన్ నజీమ్ సేథీ తెలిపారు. రెండేళ్లలోనే పీఎస్ఎల్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినందుకు సంతృప్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. పీటర్సన్ నిర్ణయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.