MIM: మజ్లిస్ పార్టీకి నేటికి 60 ఏళ్లు!
- ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఆవిర్భవించి నేటికి 60 ఏళ్లు
- పాతబస్తీలోని దారుస్సలాం కేంద్రంగా పని చేస్తున్న ఎంఐఎం
- ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పార్టీ 1927 మార్చి 2న బ్రిటిష్ ఇండియాలో మజ్లిస్-ఏ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ గా పురుడుపోసుకుంది. 1958 నుంచి క్రియాశీలక రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. 1984 నుంచి హైదరాబాదు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈ పార్టీ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. పాతబస్తీలోని దారుస్సలాం కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం పార్టీ తెలంగాణలో ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 44 మంది కార్పొరేటర్లతో బలంగా తయారైంది.
2014 ఎన్నికల నుంచి జాతీయ పార్టీగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న ఎంఐఎం, కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించే పనిలో పడింది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన ముస్లింలు, దళితులు, బడుగు, బలహీనవర్గాల కోసం తమ పార్టీ పని చేస్తోందని పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పార్టీ స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దారుస్సలాంలోని ఎంఐఎం కేంద్ర కార్యాలయం ఆవరణలో పార్టీ పతాకావిష్కరణతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.