Telangana: భూపాలపల్లి సమీపంలో భారీ ఎన్ కౌంటర్... మావో అగ్రనేతలు సహా 11 మంది హతం!
- చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్
- 11 మంది మావోయిస్టుల మృతి
- అమరుడైన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్
- పలువురికి గాయాలు
తెలంగాణలోని భూపాలపల్లి సమీపంలోని వెంకటాపురం మండల సరిహద్దుల్లో ఈ ఉదయం నుంచి భారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో పదకొండు మంది మావోయిస్టులు హతమైనట్టు ప్రాథమిక సమాచారం. మృతుల్లో మావో అగ్రనేతలు ఉన్నట్టుగా తెలుస్తుండగా, వారి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. ఛత్తీస్ గడ్ కు సమీపంలోని తడపలగుట్ట, పూజారి కాంకేడు అటవీ ప్రాంతంలో రెండు రాష్ట్రాల స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారు.
తమకు ఎదురైన మావోలను లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా ఫైరింగ్ ప్రారంభించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ ప్రారంభించాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అమరుడైనట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు పోలీసులకూ గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటన జరిగిన ప్రాంతం నుంచి పదుల సంఖ్యలో మావోలు పారిపోయారని, అక్కడి నుంచి భారీ ఎత్తున తుపాకులు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.