beast from the east: ఐరోపాను వణికిస్తున్న 'బీస్ట్ ఫ్రమ్ ద ఈస్ట్'
- సైబీరియా నుంచి తరుముకొస్తున్న శీతల గాలులు
- ఐర్లాండ్ లో రికార్డు స్ధాయి హిమపాతం కురిసే అవకాశం
- ఈ శీతల గాలులకు ‘బీస్ట్ ఫ్రమ్ ద ఈస్ట్’, ‘సైబీరియన్ బియర్’, ‘స్నో కేనన్’ అని పేర్లు
హిమపాతం ఐరోపా దేశాలను వణికిస్తోంది. సైబీరియా నుంచి తరుముకొచ్చే అతిశీతల పవనాలు ఐరోపా దేశాలను వణికిస్తున్నాయి. ఈ శీతల గాలులను బ్రిటన్ లో ‘బీస్ట్ ఫ్రమ్ ద ఈస్ట్’ అంటారు. వీటినే నెదర్లాండ్స్ లో ‘సైబీరియన్ బియర్’ అని, స్వీడన్ లో ‘స్నో కేనన్’ అని పిలుస్తారు. వీటి ప్రభావంతో ఐర్లాండ్ లో రికార్డు స్థాయిలో హిమపాతం కురుస్తుందని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. వీటి ధాటికి స్కాట్ లాండ్ లోని గ్లాస్గో విమానాశ్రయం మూతపడిందంటే హిమపాతం తీవ్రతను అంచనా వేయవచ్చు.
ఈ హిమపాతం ధాటికి గత వారం రోజుల్లో 48 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హిమపాతం తీవ్రతకు పోలండ్ (18), చెక్ రిపబ్లిక్ (6), లుధుయేనియా (5), ఫ్రాన్స్ (4), స్లొవాకియా (4), ఇటలీ (2), సెర్బియా (2), రొమేనియా (2), స్లొవేనియా (2), స్పెయిన్ (1), బ్రిటన్(1), నెదర్లాండ్స్(1) లలో మృతులు పెరుగుతున్నారు. ఈ హిమపాతం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు తెలిపాయి. దీని ధాటికి ఆరుబయట నిద్రించే గూడు లేని పేదలు గడ్డకట్టి మరణిస్తున్నారని వార్తలొస్తున్నాయి.