Tirumala: 56,424 శ్రీవారి సేవా టికెట్లు విడుదల... ఇక తిరుమలకు ఎవరు వెళ్లినా మూడు గంటల్లోనే దర్శనం!
- జూన్ నెల కోటా విడుదల
- నాలుగు రోజుల పాటు పేర్ల నమోదుకు అవకాశం
- నెలాఖరులోగా పూర్తి స్థాయి టైమ్ స్లాట్ విధానం
- వెల్లడించిన ఈఓ అనిల్ సింఘాల్
జూన్ నెల తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదలైంది. మొత్తం 56,424 టికెట్లను ఆన్ లైన్లో డ్రా, రెగ్యులర్ బుకింగ్ విధానంలో అందుబాటులోకి తెచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ సింఘాల్ వెల్లడించారు. సుప్రభాతం, అర్చన, తోమాల సేవ, నిజపాదదర్శనం కోరుకునే వారు నేటి నుంచి నాలుగు రోజుల్లోగా టీటీడీ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు డ్రా తీసి సేవా టికెట్లు పొందిన వారి వివరాలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.
నిత్యమూ జరిగే కల్యాణోత్సవం, విశేష పూజ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవ తదితరాలకు ఆన్ లైన్ విధానంలో ఎప్పటి మాదిరిగానే టికెట్లను విడుదల చేశామని అన్నారు. శ్రీవారి ఆలయంలో భక్తులు ధ్వజస్తంభాన్ని కూడా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని సింఘాల్ వెల్లడించారు.
శ్రీవారి సర్వదర్శనం భక్తులకు మూడు గంటల్లోనే ఇకపై దర్శనం చేయించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 120 టైమ్ స్లాట్ కేటాయింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని, నెలాఖరులోగా ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెస్తామని తెలిపారు.
రెండు నెలల క్రితం టైమ్ స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి విజయం సాధించామని గుర్తు చేసిన ఆయన, ఈ విధానంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం రాదని పేర్కొన్నారు. ఒంటిమిట్ట ఆలయంలో ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 3 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కన్యాకుమారి, కురుక్షేత్రంలో రూ. 59 కోట్ల అంచనా వ్యయంతో శ్రీవారి ఆలయాల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయని వెల్లడించారు.