Chidambaram: చిదంబరం మెడకు ఉచ్చు... విచారణకు సిబీఐ నోటీసులు!
- చిదంబరాన్ని ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం
- నోటీసుల జారీకి రంగం సిద్ధం
- రాజకీయ కక్షసాధింపంటున్న చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ, ఇప్పుడు చిదంబరాన్ని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన్ను విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ, నోటీసులను జారీ చేయనున్నట్టు సమాచారం.
యూపీఏ హయాంలో ఐఎన్ఎక్స్ మీడియాకు లబ్ది కలిగేలా కార్తీ చిదంబరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, అప్పటి ఆర్థికమంత్రిగా చిదంబరం తన కుమారుడికి సహకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తన కుటుంబాన్ని నరేంద్ర మోదీ సర్కారు ఇబ్బందులు పెడుతోందని చిదంబరం ఆరోపిస్తున్నా, సీబీఐ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. కాగా, నిన్న కార్తీని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సీబీఐ, నేడు కూడా ఆయన్ను ప్రశ్నిస్తోంది.