kapil dev: ఆ ఇద్దరూ టీమ్ లో ఉంటే.. ప్రపంచకప్ భారత్ దే: కపిల్ దేవ్
- జట్టులో కోహ్లీ, ధోనీ ఇద్దరూ ఉండాలి
- కోహ్లీ దూకుడు, ధోనీ ప్రశాంతత జట్టుకు లాభిస్తుంది
- బ్యాటింగ్ పై పాండ్యా దృష్టి సారిస్తే.. గొప్ప ఆల్ రౌండర్ అవుతాడు
2019లో జరగనున్న ప్రపంచ కప్ లో విజయబావుటా ఎగురవేసే దిశగా కోహ్లీ సేన ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్ కు తొలి వరల్డ్ కప్ ను అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా గురించి స్పందించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తిరిగి పుంజుకుని, విజయాలను సాధించే క్రమంలో టీమిండియా ఎంతో పరిణతి సాధించిందని ఆయన అన్నారు. 2019 ప్రపంచ కప్ లో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీ ఇద్దరూ ఉండాలని చెప్పారు. కోహ్లీ దూకుడు, ధోనీ ప్రశాంతత భారత్ ను విజయతీరాలకు చేరుస్తాయని తెలిపారు.
వీరిద్దరి కాంబినేషన్ జట్టుకు ఎంతో మేలు చేస్తుందని కపిల్ అన్నారు. ఓ వ్యక్తి దూకుడుగా ఉన్నప్పుడు... ప్రశాంతంగా ఉంటూ, ఆటపై పూర్తి స్థాయిలో కమాండ్ ఉన్న మరో ఆటగాడు ఉన్నప్పుడు... ఆ కాంబినేషన్ జట్టుకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. అయితే, మరీ ఎక్కువ దూకుడు, మరీ ఎక్కువ ప్రశాంతత కూడా జట్టుకు చెడు చేస్తుందని అన్నారు. జట్టులోని అందరూ అగ్రెసివ్ గా ఉన్నా, అందరూ ప్రశాంతంగా ఉన్నా జట్టుకు చేటేనని... అందుకే వీటి రెండు కలయికతో జట్టు ఉండాలని చెప్పారు.
మరోవైపు, హార్ధిక్ పాండ్యా తాజా ప్రదర్శన పట్ల కపిల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాండ్యాను తాను బ్యాట్స్ మెన్ ఆల్ రౌండర్ గా చూడాలనుకుంటున్నానని... ఈ నేపథ్యంలో, బ్యాట్ తో పాండ్యా మరింత ప్రదర్శన చేయాల్సి ఉందని చెప్పారు. బౌలర్ గా పాండ్యా రాణిస్తాడనే నమ్మకం ఉందని... బ్యాటింగ్ పై దృష్టి సారిస్తే, గొప్ప ఆల్ రౌండర్ గా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. పాండ్యాపై ఎక్కువ అంచనాలు ఉన్నాయని... వాటిని అందుకోవడానికి అతను మరింత శ్రమిస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పారు.