Revanth Reddy: రేవంత్ రెడ్డి ద్రోహం చేశాడు.. టీఆర్ఎస్తో టీటీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిందే: మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
- ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి టీడీపీకి చెడ్డపేరు తీసుకువచ్చాడు
- టీటీడీపీకి ఈ రోజున్న పరిస్థితులు ఏంటీ?
- ఆనాడు రేవంత్ రెడ్డిని బయటకు గెంటేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు
- ఇప్పుడు టీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉంది
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి టీడీపీకి చెడ్డపేరు తీసుకువచ్చారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... "టీటీడీపీకి నేను వ్యతిరేకం కాదు. ఈ రోజున్న పరిస్థితులు ఏంటీ? రేవంత్ రెడ్డి చేసిన ద్రోహాన్ని పార్టీలో ఎవ్వరూ అడగడం లేదు.. పార్టీ పరువును తీశాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు లాంటి నాయకుడికి రేవంత్ రెడ్డి తలవంపులు తెచ్చాడు. రేవంత్ రెడ్డిని ఆనాడు మెడలు పట్టి పార్టీ నుంచి బయటకు గెంటేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
పార్టీని కాపాడుకోవాలనుకుంటోన్న నాలాంటి వాడికి ఎంత బాధ ఉంటుంది. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబుకి చెడ్డపేరు వచ్చింది. ఐదారుగురు తప్ప టీటీడీపీలో ఎవరైనా నాయకులు ఉన్నారా? నేను పార్టీలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నాను. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన పార్టీ వెనకపడి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉంది. రాజకీయ సిద్ధాంత పరంగా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కచ్చితంగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవసరం ఉంది. నేను ఎందుకు చెబుతున్నానంటే రేవంత్ రెడ్డిలాంటి వారు పార్టీని చీల్చి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఓ స్నేహితుడిగా చెబుతున్నా, ఎన్టీఆర్ జయంతి వంటి వాటిని కేసీఆర్ తెలంగాణలో అధికారికంగా చేయాల్సి ఉంది. పది లక్షల మంది తెలంగాణ టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు మనో ధైర్యం నింపాల్సి ఉంది. పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తే బాగుంటుంది. అంతే తప్పా తెలంగాణ టీడీపీ నాయకులే ఈ రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడం సరికాదు.
కొన్ని చోట్ల తిరుగుతామని చంద్రబాబు చెప్పారు. మన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడం లేదనే బాధతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఎన్టీఆర్ ఆశీస్సులు పొందిన వారు చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. 2009లో మేము టీఆర్ఎస్తో కలిసే మహాకూటమి ఏర్పాటు చేశాం కదా?" అని ఆయన వ్యాఖ్యానించారు.