chandrababu: ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు.. బీజేపీ నేతలపై ఫైర్!
- హోదా వద్దని ఎప్పుడూ, ఎక్కడా అనలేదు
- వేరే రాష్ట్రాలకు హోదా ఉండదని చెబితేనే.. ప్యాకేజీకి ఒప్పుకున్నాం
- వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నప్పుడు.. మాకూ ఇవ్వాల్సిందే
నాలుగేళ్ల సమయం అయిపోయినా ఏపీకి ఇంకా విభజన గాయాలు మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలా బీజేపీ కూడా అన్యాయం చేస్తుందా? అని ఏపీ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రత్యేకహోదా వద్దని మనం ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఉండదని చెప్పినందుకే... ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. వేరే రాష్ట్రాలకు హోదా ఉండదని చెప్పి... ఇప్పుడు వాటికి హోదాను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగించాలనుకుంటే... ఆ హోదాను తమకు కూడా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
విభజన చట్టంలో ఎన్నో అంశాలు ఉన్నాయని... హోదా తప్ప మిగిలిన 18 అంశాలను వైసీపీ వదిలేస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి హోదా ఒక్కటే చాలదని... చట్టంలో మిగిలిపోయినవన్నీ చేయాల్సిందేనని చెప్పారు. బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై ఆయన మండిపడ్డారు. ఏపీకి చెందినవారై ఉండి... రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అడగకుండా... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.