kavitha: మోదీని కావాలని కేసీఆర్ అలా అనలేదు.. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నాం: కవిత
- టంగ్ స్లిప్ అయింది అంతే
- కేసీఆర్ ది అలాంటి సంకుచిత తత్వం కాదు
- బీజేపీ నేతలు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు
ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకవచనంతో సంబోధించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం గురించి కేటీఆర్ తో మాట్లాడానంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో చెప్పినప్పటినుంచి... దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశం గురించి టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందించారు.
ప్రధాని మోదీని అవమానించాలనే ఉద్దేశం కేసీఆర్ కు ఏ కోశానా లేదని... కేసీఆర్ ది అలాంటి సంకుచిత స్వభావం కాదని ఆమె అన్నారు. తన ప్రసంగం సందర్భంగా కేసీఆర్ కావాలని అలా అనలేదని (మోదీ గురించి)... ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందని చెప్పారు. చిన్న పొరపాటును బీజేపీ నేతలు పెద్దది చేయాలనుకోవడం సరికాదని అన్నారు. రైతుల పట్ల ఆవేదనతోనే కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని చెప్పారు.
ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచే ఏపీకి తాము మద్దతు ఇస్తున్నామని కవిత అన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు టీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు.