galla jayadev: అవసరమైతే కోర్టుకెళతాం: చంద్రబాబుతో భేటీ తరువాత గల్లా జయదేవ్
- ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- ప్యాకేజీ ప్రకటించి ఏమీ ఇవ్వలేదు
- కాబట్టి హోదా డిమాండ్ చేస్తున్నాం
- హోదా కింద ఇతర రాష్ట్రాలకు ఇస్తోన్న వాటిని మాకూ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఏమీ ఇవ్వలేదు కాబట్టి తాము ఇక ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... అవసరమైతే విభజన హామీలపై కోర్టుకు కూడా వెళతామని అన్నారు. ఫైనాన్స్ బిల్లులో సవరణలు చూశాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
సమస్యకు పరిష్కారం వచ్చేవరకూ పోరాటం కొనసాగిస్తామని గల్లా జయదేవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్లోనూ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంపై తాము ఇప్పటికే పార్లమెంటులో అడిగామని అన్నారు. మళ్లీ సద్దిచెప్పాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. మిత్రపక్ష ధర్మం పాటిస్తూనే ముందుకు వెళతామని చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు కూడా హోదా ఉండదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలో ఉండే ప్రయోజనాలను కల్పిస్తోందని అన్నారు. హోదా కింద ఇతర రాష్ట్రాలకు ఇస్తోన్న వాటిని ఏపీకి కూడా ఇవ్వాలని తాము కోరుతున్నట్లు గల్లా జయదేవ్ తెలిపారు.