BJP: ఆ ఆధారాలు ఇస్తే నేను కూడా కేంద్రాన్ని నిలదీస్తా!: బీజేపీ నేత హరిబాబు
- విభజన చట్టం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం
- ఐదు అంశాలు మాత్రమే అపరిష్కృతంగా వున్నాయి
- ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ మరోసారి ప్రయత్నిస్తోంది
బీజేపీ అధికారం చేపట్టిన ఈ మూడున్నరేళ్ల కాలంలో దేశంలో ఏ రాష్ట్రానికీ చేయనంత సాయం ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేసిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. విజయవాడలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, మూడు రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా పొడిగించిందని చెబుతోన్న టీడీపీ నేతలు, వాటికి సంబంధించిన ఆధారాలను తనకు ఇస్తే తాను కూడా కేంద్రాన్ని నిలదీస్తానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలను సైతం కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏపీకి పదేళ్ల ప్రత్యేకహోదాని అడిగితే పట్టించుకోకుండా, అడ్డగోలుగా విభజించి, మళ్లీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదా ఫైలుపై చేస్తామని ప్రకటించడం ప్రజలను మరోసారి మోసం చేయడానికేనని ఆయన స్పష్టం చేశారు.
పోలవరంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కి లేదని, తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలిపి, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన పార్టీ తమదని ఆయన గుర్తుచేశారు. అపరిష్కృతంగా ఉన్న ఐదు అంశాలు మాత్రమే కేంద్రం ముందున్నాయని ఆయన తెలిపారు. దుగరాజపట్నం పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరిందని ఆయన చెప్పారు. విశాఖరైల్వే జోన్ పై త్వరలో ప్రకటన వస్తుందని ఆయన అన్నారు. కడప ఉక్కుకర్మాగారంపై నిపుణులతో అధ్యయనం జరుగుతోందని ఆయన తెలిపారు. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.