Tamilnadu: పశువుల్ని తెచ్చినట్టు లారీలో ఎర్రచందనం కూలీల్ని తెచ్చారు... 84 మంది పట్టుబడ్డారు.. వారిలో విద్యావంతులు కూడా!
- తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు కూలీలు
- ఆర్కాడులో ఏపీ 04 డబ్ల్యూ 3877 లారీలో 84 మందిని ఎక్కించిన స్మగ్లర్లు
- చాకచక్యంగా డ్రైవ్ చేసుకుంటూ అటవీప్రాంతానికి తీసుకొచ్చిన లారీ డ్రైవర్
శేషాచలం అటవీప్రాంతంలో భారీ ఎత్తున ఎర్రచందనం దొంగలు పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని వేలూరు, తిరువన్నామలై జిల్లాలోని జువ్వాదిమలై, పలయపలం ప్రాంతాలకు చెందిన 84 మంది కూలీలను చెట్లు నరకాలని, రోజుకు 800 రూపాయల కూలీ ఇస్తామని స్మగ్లర్లు బేరమాడుకున్నారు. పశువులను లారీలో కుక్కినట్టు వారందర్నీ ఆర్కాడులో ఏపీ 04 డబ్ల్యూ 3877 లారీలో ఎక్కించి శేషాచలం అటవీప్రాతానికి తరలించారు.
డ్రైవర్ చాకచక్యంగా పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వారిని శేషాచలం అటవీప్రాంతానికి తీసుకొచ్చాడు. అయితే, ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో ఏపీ సరిహద్దుల్లో ప్రవేశించిన లారీని వెంబడించిన పోలీసులు, అడవులకు సమీపంలో లారీ ఆగగానే, నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు.
వారిలో సేలం యూనివర్సిటీలో ఎమ్మెస్సీ గణితం చదువుతున్న ఏలుమలై అనే ఉన్నత విద్యావంతుడు కూడా ఉండడం విశేషం. అతనికి ఏప్రిల్ లో వివాహం కానుంది. అత్యంత పేదరికంలో ఉండడంతో, ఇలా కూలి చేసుకుంటే పెళ్లి ఖర్చులకు పనికొస్తుందనే కారణంగా వచ్చానని ఏలుమలై తెలిపాడు. కూలికి మాట్లాడిన మేస్త్రీ తనతో కేరళలో పని ఉందన్నాడని, రోజూ 800 రూపాయలు కూలీ ఇస్తానని చెప్పడంతో వచ్చానని అన్నాడు.
సెంగం గ్రామానికి చెందిన గోవిందరాజులు అనే కుర్రాడు ఎంకాం చదువుతున్నాడు. తనకు మాత్రం ఎర్రచందనం దుంగలు కొట్టాలని చెప్పారని, కేజీ దుంగకు 500 రూపాయలిస్తామని చెప్పారని, కూలి డబ్బు చదువుకి పనికొస్తుందని వచ్చానని తెలిపాడు. వచ్చినవారంతా నిరుపేదలని, వారిలో చాలా మందికి ఎర్రచందనం నరికేందుకు తీసుకొస్తున్నట్టు తెలియదని, మిగలిన వారు పేదరికం కారణంగా పనికి వచ్చినట్టు చెప్పారు. వారందర్నీ అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించనున్నామని పోలీసులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో ఎర్రచందనం దొంగలు దొరకడం ఇదే తొలిసారిని పోలీసులు వెల్లడించారు.