AISF: ప్రియా వారియర్‌కు కమ్యూనిస్టుల సపోర్ట్...!
- సీపీఐ రాష్ట్ర సమావేశ ప్రచారానికి ప్రియా ఫొటోలు
- ఈ రకంగా 'ఒరు అదార్ లవ్' దర్శకనిర్మాతలకు పార్టీ సంఘీభావం
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్లు
'ఒరు అదార్ లవ్' చిత్రంలోని ఓ పాటలో ప్రదర్శించిన 'కన్నుకొట్టుడు' పోజుతో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు కేరళలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కార్యకర్తలు బాసటగా నిలుస్తున్నారు. పార్టీకి అనుబంధంగా ఉన్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తమ పార్టీ రాష్ట్ర సమావేశానికి ఆమె పోస్టర్ల ద్వారా ప్రచారం కల్పిస్తోంది. ఒరు అదార్ లవ్ సినిమా పోస్టర్లను తలపించే విధంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. సీపీఐ కేరళ రాష్ట్ర సమావేశం మలప్పురంలో నిన్న ప్రారంభమయింది. ఈ సమావేశం ప్రారంభానికి చాలాకాలం ముందు నుంచే ప్రియా వారియర్ పోస్టర్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి.
కాగా, ఒరు అదార్ లవ్ చిత్ర దర్శకనిర్మాతలకు సంఘీభావంగా ఈ పోస్టర్లు విడుదల చేశామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీ.జంషీర్ తెలిపారు. తమ పోస్టర్లు చిత్ర దర్శకనిర్మాతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు మద్దతు తెలుపుతాయని ఆయన చెప్పారు. కాగా, ప్రియా వారియర్ పోజుతో పాటు ఆ సినిమాలోని పాట వివాదాస్పదం కావడంతో ఆమెపై దేశంలోని పలుచోట్ల కేసులు నమోదు కాగా సుప్రీంకోర్టు వాటిపై స్టే విధించిన సంగతి తెలిసిందే.