CBI: ఇన్ఫోసిస్, ఐటీ సిబ్బంది మాయాజాలం...రంగంలోకి దిగిన సీబీఐ
- తప్పుడు పత్రాలతో రివైజ్డ్ ఐటీ రిటర్నుల దాఖలు
- మూడు అసెస్మెంట్ సంవత్సరాల్లో మోసపు దందా..!
- రూ.5 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగం
సవరించిన పన్ను రిటర్ను (రివైజ్డ్ ఐటీ రిటర్న్స్)ల మోసానికి సంబంధించి ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్ టెక్నాలజీస్'కి చెందిన కొందరు ఉద్యోగులు, ఆదాయపు పన్ను శాఖ (ఐటీ)కు చెందిన ఆఫీసర్లు, బెంగళూరుకు చెందిన ఓ చార్డెట్ అకౌంటెండ్ (సీఏ)ల పాత్రను తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఈ స్కామ్ గుట్టును ఐటీ శాఖ అధికారులు ఈ జనవరిలో రట్టు చేశారు.
నిందితులపై అభియోగాలను నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. కొందరు ఐటీ అధికారులు, ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఓ నకిలీ సీఏతో కుమ్మక్కై తప్పుడు పత్రాలను ఉపయోగించి పలు ప్రైవేటు కంపెనీలకు చెందిన 250 మంది పన్ను చెల్లింపుదారుల పేర్లతో 1,010 సవరించిన పన్ను రిటర్నులను దాఖలు చేసినట్లు గుర్తించామని సీబీఐ పేర్కొంది.
ఇదంతా మూడు అసెస్మెంట్ సంవత్సరాల్లో చేశారని, చట్టవిరుద్ధంగా దాదాపు రూ.5 కోట్ల మేర చెల్లింపులు పొందారని దర్యాప్తు సంస్థ తన ఎఫ్ఐఆర్లో అభియోగించింది. మోసపు మార్గంలో పొందిన ఈ డబ్బు మొత్తాన్ని నిందితులంతా సమానంగా పంచుకున్నట్లు తెలుస్తోందని తెలిపింది. సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ఎస్ఎస్కే అసోసియేట్స్ భాగస్వామి నగేశ్ శాస్త్రిని తొలి ముద్దాయిగా పేర్కొంది. ఇదిలా ఉంటే, ఎఫ్ఐఆర్లోని అంశాలను తెలుసుకోకుండా దీనిపై మాట్లాడలేమని ఇన్ఫోసిస్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.