Pawan Kalyan: బీజేపీ, టీడీపీలకి నేను పార్ట్‌నర్‌నని కొందరు అంటున్నారు.. !: పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ ఆవిర్భావానికి ఆంధ్రప్రదేశ్ విభజన తీరే కారణం
- గత ఎన్నికల్లో నేను బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చాను
- అప్పట్లో ఆయా పార్టీల నేతలు ఎన్నో హామీలు కురిపించారు
- ప్రజలతో పాటు నేను కూడా ఆ హామీలను నమ్మాను
జనసేన పార్టీ ఆవిర్భావానికి ఆంధ్రప్రదేశ్ ను విభజన చేసిన తీరే కారణమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విభజన జరిగిన తీరుకి నష్టపోయి ఆంధ్రప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. జేఎఫ్‌సీ తమకు అందించిన నివేదికలోని వివరాలను పవన్ కల్యాణ్ ఈ రోజు మీడియాకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారని, ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. చాలా సంస్థలు హైదరాబాద్ లోనే ఉండిపోయాయని చెప్పారు.
గత ఎన్నికల్లో తాను బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చానని అన్నారు. అప్పట్లో ఆయా పార్టీల నేతలు ఎన్నో హామీలు కురిపించారని చెప్పారు. ప్రజలతో పాటు తాను కూడా ఆ హామీలను నమ్మానని తెలిపారు. తాను గతంలో ఆ పార్టీలకు మద్దతు తెలిపినందుకు ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారని, మరోవైపు కొందరు బీజేపీ, టీడీపీకి తాను పార్ట్‌నర్‌నని అంటున్నారని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని తనను ప్రశ్నిస్తున్నారని, దీంతో తనకు చాలా బాధ కలిగిందని, అందరికీ అవగాహన కల్పించొచ్చనే ఉద్దేశంతో తాను చొరవ తీసుకుని జేఎఫ్‌సీ ఏర్పాటు చేశానని అన్నారు. జేఎఫ్‌సీ నివేదికలో వున్న 11 అంశాలను తాను ఈ రోజు ప్రజల ముందు ఉంచుతున్నానని చెప్పారు.