YSRCP: ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్టు .. పులివెందులలో పెద్దఎత్తున మోహరించిన పోలీసులు
- టీడీపీ నాయకుల సవాల్ పై వైసీపీ ప్రతిసవాల్
- చర్చకు సమాయత్తమవుతున్న ఇరు పార్టీలు
- భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు
- పులివెందుల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు సవాల్ విసరడం, అందుకు ‘సరే’ అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రతి సవాల్ విసరడం తెలిసిందే. ఈ విషయమై ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులలో చర్చకు రెండు పార్టీలు సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఇరుపార్టీల నేతలు ఎదురుపడితే ఘర్షణలు తలెత్తే అవకాశాలుండటంతో పులివెందులలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
నియోజకవర్గం నుంచే గాక కడప జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఆయా పార్టీల కార్యకర్తలు పులివెందులకు చేరుకుంటున్నారు. ఈ తరుణంలో పులివెందుల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు, ఎవరినీ పట్టణంలోకి అనుమతించట్లేదు. మరోపక్క, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తమ నేత హౌస్ అరెస్టును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటే కుదరదని, పులివెందుల కోసం ఎవరు ఏం చేశారో తేలాలని అన్నారు. ‘పులివెందులకు టీడీపీ చేసిందేమిటో, వైసీపీ చేసిందేమిటో తేలుద్దాం’ అని అవినాష్ నినదించారు.