BJYM: పవన్‌కు సీమ గోడు పట్టదా?...బీజేపీ నేత సూటిప్రశ్న
- సీమలో హైకోర్టు ప్రతిపాదనపై వైఖరేంటి?
- కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫండ్ ఏమైంది?
- కియో మోటార్స్ ప్రాంతంలో టీడీపీ నేతలకు భూములు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాయలసీమ గోడు పట్టదా? అని బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్.రమేష్ నాయుడు ఆదివారం మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నించారు. సీమలో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై ఆయన వైఖరేంటో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జనసేన పార్టీలో కాలం చెల్లిన నేతలు, స్వయంప్రకటిత మేధావులు ఉన్నారని, జేఎఫ్సీ నివేదిక కోసం నిర్వహించిన సమావేశం వట్టి బూటకమని ఆయన విమర్శించారు. గతంలో పవన్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దాని నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించారని, ఇప్పుడు ఆ డబ్బు ఏమైందో చెప్పాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.
మరోవైపు టీడీపీ నేతలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇటీవల అనంతపురంలో కియో మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథ్ రెడ్డి భూములు కొనుగోలు చేశారని, ఇందుకు తన వద్ద తగిన ఆధారాలున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి భూములను తిరిగి రైతులకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.