kcr: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కు మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నా!: పవన్ కల్యాణ్
- ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేసీఆర్ కు నా కృతజ్ఞతలు
- థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఉండాలన్నది ‘జనసేన’ అభిప్రాయం
- ఫ్రంట్ కు అంకురార్పణ చేయాలనుకున్న కేసీఆర్ కు సాటి తెలుగు వాడిగా మద్దతు పలుకుతున్నా
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనకు మనస్ఫూర్తిగా తన మద్దతు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
తెలుగు ప్రజలపై ఆయనకున్న, ప్రేమాభిమానాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కొనియాడారు. జాతీయ పార్టీల తీరు వల్లే ప్రాంతీయ పార్టీలు పుడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చి ఉంటే జనసేన పార్టీ పుట్టేదే కాదని అన్నారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను అర్థం చేసుకోకపోతే థర్డ్ ఫ్రంట్ పుడుతుందని, థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఉండాలన్నది ‘జనసేన’ అభిప్రాయమని అన్నారు.
భారతదేశం, తెలంగాణ సమాజం, సమస్యల పట్ల చాలా బలమైన, లోతైన అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రక్తపు చుక్క కిందపడకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని, అలాంటి నాయకుడు ఈ థర్డ్ ఫ్రంట్ కు అంకురార్పణ చేసి ముందుకు తీసుకెళ్తానంటే సాటి తెలుగువాడిగా స్వాగతిస్తున్నానని, మనస్ఫూర్తిగా తాను మద్దతు పలుకుతున్నానని స్పష్టం చేశారు.