krishnam Raju: ఆ కార్యక్రమానికి తప్పకుండా వస్తాను సార్ అంది.. శ్రీదేవి సంతాప సభలో కృష్ణంరాజు భావోద్వేగం

  • సుబ్బరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ
  • శ్రీదేవితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కృష్ణంరాజు
  • శ్రీదేవి మళ్లీ పుడితే తప్ప ఆ లోటు భర్తీ కాదన్న నరేష్

హైదరాబాద్‌లోని టి.సుబ్బరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీదేవి సంతాప సభలో సీనియర్ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. శ్రీదేవికి పెద్దలంటే విపరీతమైన గౌరవమని, తనను సార్ అని పిలిచేదని గుర్తు చేసుకున్నారు. కొన్ని పాత్రలను శ్రీదేవి తప్ప మరెవరూ చేయలేరని పేర్కొన్నారు. గతంలో ఓసారి శ్రీదేవితో మాట్లాడుతూ సినీరంగంలోకి వచ్చి తనకు 50 ఏళ్లు పూర్తయ్యాయని, మీకూ 50 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి వేడుకగా జరుపుకోవాలని శ్రీదేవిని కోరానని, దానికి ఆమె బదులిస్తూ ‘‘మీ వేడుకకు నేను వస్తాను సార్’’ అని చెప్పిందని గుర్తు చేస్తుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

మరో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ తెలుగింటి అందాల ఆడపడుచు చెప్పకుండానే వెళ్లిపోయిందని అన్నారు. మళ్లీ తనే పుడితే తప్ప శ్రీదేవి లోటును మరెవరూ భర్తీ చేయలేరని అన్నారు. తామిద్దరం బాల్య స్నేహితులం మాత్రమే కాదని, మంచి స్నేహితులం కూడా అని పేర్కొన్నారు. ఆమె చనిపోయిందని చెబుతూ మెసేజ్‌లు వస్తున్నా అంగీకరించేందుకు తన మనసు అంగీకరించలేదని అన్నారు. ముంబై వెళ్లే ధైర్యం లేక ఆమెను కడసారి చూడలేకపోయానని పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ఆమె మరణవార్త తెలిసి షాకయ్యానని, దేవతలు కూడా చనిపోతారా? అని అనుకున్నానని అన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News