BJP: కేసీఆర్ తో నేను మాట్లాడింది నిజమే: హేమంత్ సోరెన్
- కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతించిన హేమంత్ సోరెన్
- చాలా అంశాలపై ఇరువురమూ చర్చించాం
- బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకే వేదికపైకి
- ఆ సత్తా ఉన్న నేతల్లో కేసీఆర్ ఒకరు
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఖాయమని, దానికి తానే నాయకత్వం వహించేందుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ స్వాగతించారు. తృతీయ కూటమి విషయమై కేసీఆర్ తో తాను మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు. తాము చాలా అంశాలపై చర్చించామని, రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై ఒకరి అభిప్రాయాలను ఒకరం పంచుకున్నామని అన్నారు.
తాగునీరు, ఆరోగ్యం, రైతుల ఆత్మహత్యలు వంటివి దేశంలో పరిష్కారం లేని సమస్యలుగానే ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలపై రైతులు, బడుగు, బలహీన వర్గాల తరఫున రాజకీయ పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ వంటి ఉద్యమ నేత ముందు నిలిస్తే పోరాటంలో విజయం త్వరగా సాధించవచ్చని హేమంత్ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో బీజేపీతో ఒంటరిగా పోరాడుతున్నామని, ఆ పార్టీకి బదులిచ్చే సత్తా తమకుందని తెలిపారు. ఇదేలా అనేక రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉన్నారని, వారంతా కలిస్తే జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ శక్తులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే సత్తాగల నేతల్లో కేసీఆర్ ఒకరని తెలిపారు.