Tripura: త్రిపురలో గెలిచిన మర్నాడే బీజేపీ షాకిచ్చిన మిత్రపక్షం!
- ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన ఐపీఎఫ్‌టీ
- అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ వైఖరిలో మార్పు ఉండదన్న అధ్యక్షుడు ఎన్‌సీ దేవ్ వర్మ
- బీజేపీకి ఆదిలోనే హంసపాదు
త్రిపుర ఎన్నికల్లో గెలిచిన మర్నాడే బీజేపీకి ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) షాకిచ్చింది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగానే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్‌సీ దేవ్ వర్మ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఏళ్లుగా పోరాడుతున్నామని, తమ డిమాండ్‌ను కేంద్రం పరిశీలిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం అత్యున్నత స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుందని తాము ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. అధికారంలో ఎవరున్నా తమ డిమాండ్‌లో మాత్రం మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
త్రిపురలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్‌టీలు కలిసి పోటీ చేశాయి. ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి ఘన విజయం సాధించి ఏళ్లుగా పాతుకుపోయిన లెఫ్ట్ పార్టీకి షాకిచ్చింది. 1997లో ఏర్పాటైన ఐఫీఎఫ్‌టీ తొలి నుంచీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూనే ఉంది. కాగా, ఐపీఎఫ్‌టీ ప్రత్యేక గళం అందుకున్నా ప్రస్తుతానికి బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సంఖ్యాబలం బీజేపీకి ఉంది. అయితే, అధికారాన్ని చేజిక్కించుకున్న మర్నాడే ఇలా ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐపీఎఫ్‌టీ డిమాండ్‌పై బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.