Uttam Kumar Reddy: నాలుగేళ్లుగా మోదీ అంటే కేసీఆర్ గడగడ వణికాడు... ఫెడరల్ ఫ్రంటూ లేదు మన్నూలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి కేసీఆర్ మద్దతిచ్చారు
  • ఫెడరల్ ఫ్రంట్ అంటూ నాటకాలాడుతున్నారు
  • రైతు ఉత్పత్తుల కొనుగోళ్లకు నిధులెందుకు కేటాయించలేదు?

జాతీయ పార్టీలు దేశానికి చేసిందేమీలేదని... థర్డ్ ఫ్రంట్ అనివార్యమని, దానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ పై టీఎస్ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్, నిజామాబాద్‌ లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్లుగా ప్రధాని మోదీ అంటే కేసీఆర్ గడగడ వణికారని అన్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో బీజేపీ సర్కారుకు మద్దతిచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కొత్త నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క ఎంపీ సీటూ గెల్చుకోలేరని, అలాంటి కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంటూ లేదు, మన్నూలేదు అంటూ ఆయన వెటకారమాడారు. నాలుగు వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించేందుకు కూడా వెళ్లని కేసీఆర్, అకస్మాత్తుగా రైతులను ఉద్ధరిస్తానని చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌ లో రైతు ఉత్పత్తుల కొనుగోళ్లకు నిధులెందుకు కేటాయించలేదని ఆయన అడిగారు. 

  • Loading...

More Telugu News