Congress: 'అన్నీ అసత్యాలే చెప్పారు'.. గవర్నర్ ప్రసంగంపై ఏపీసీసీ స్పందన
- చంద్రబాబు చెప్పే అవాస్తవాలనే గవర్నర్ వల్లె వేశారు
- నాలుగేళ్లుగా మోదీ రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయం గుర్తుకు రాలేదా?
- ఓట్ల కోసం ప్రజలను మరోసారి మభ్య పెట్టాలని చూస్తున్నారు
ఈ రోజు శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం... ఇటీవల తరుచుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతోన్న కథలను మక్కీకి మక్కీ దింపినట్లు ఉందని ఏపీసీసీ విమర్శించింది. చంద్రబాబు చెప్పే అవాస్తవాలనే గవర్నర్ వల్లె వేశారని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేరిట ఆ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
నాలుగేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయం గవర్నర్ నరసింహన్కు, చంద్రబాబు నాయుడికి గుర్తుకు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికి నాటకమాడుతున్నారని చెప్పారు. అందులో భాగమే గవర్నర్ ప్రసంగం అని, ఇది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అని అర్థమవుతోందని విమర్శించారు. 11.3 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం పరుగులు పెడుతోందని చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను వెల్లడించి, రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు చిత్తశుద్ధితో పోరాడాలని ఏపీసీసీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.