KCR: థర్డ్ ఫ్రంట్ లో భాగస్వామినవుతా: కేసీఆర్ తో అజిత్ జోగి

  • సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసిన జేసీసీ అధినేత జోగి
  • ప్రత్యేక తెలంగాణ సాధనలో విజయం సాధించిన గొప్ప నేత కేసీఆర్
  • భవిష్యత్ లో కూడా మరింత గొప్పనేతగా ఎదగాలి : అజిత్ జోగి

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ప్రకటన చేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఎంపీలు తమ మద్దతు తెలుపుతున్నట్టు కేసీఆర్ తో పేర్కొనడం విదితమే.

తాజాగా, జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ (జేసీసీ) అధినేత, ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి నుంచి కేసీఆర్ కు ఫోన్ కాల్ వచ్చింది. భారతదేశ రాజకీయాల్లో సంపూర్ణమైన మార్పు రావాలన్న కేసీఆర్ ప్రకటనకు తన మద్దతు తెలియజేస్తున్నానని ఆయన అన్నట్టు సమాచారం. కేసీఆర్ కనుక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఆయనకు మద్దతుగా నిలుస్తానని, థర్డ్ ఫ్రంట్ లో భాగస్వామి నవుతానని పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో విజయం సాధించిన కేసీఆర్ గొప్ప నేతగా నిరూపించుకున్నారని, అదేమాదిరి, భవిష్యత్ లో కూడా మరింత గొప్పనేతగా ఎదగాలని జోగి ఆకాంక్షించినట్టు తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు నిమిత్తం భావ సారూప్యత ఉన్న పార్టీలను కూడగడతానని కేసీఆర్ తో జోగి అన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News